sajjanar: 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తోందన్న సజ్జనార్
- ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే ఉన్నారని వెల్లడి
- ప్రతిరోజు సగటున 30 లక్షలమంది మహిళలు రాకపోకలు సాగించినట్లు వెల్లడి
ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా పదకొండు రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహాలక్ష్మి.. ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో మూడు కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారన్నారు. ప్రతిరోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని, పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని టీఎస్ఆర్టీసీ సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోందన్నారు.
మహిళల ఉచిత ప్రయాణ పథకం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగిందన్నారు. ఈ నెల 16వ తేదీన 17 డిపోలు, 17వ తేదీన 20 డిపోలు, 18వ తేదీన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయినట్లు వెల్లడించారు. గత మూడ్రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజూరాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించినట్లు తెలిపారు.
త్వరలో 2050 కొత్త బస్సులు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, విడతల వారీగా ఆ బస్సులను ఉపయోగంలోకి తీసుకువస్తామని ట్వీట్లో పేర్కొన్నారు.