Nara Lokesh: జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది: నారా లోకేశ్
- 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నారా లోకేశ్
- కుప్పంలో మొదలై విశాఖలో ముగిసిన పాదయాత్ర
- పోలిపల్లి వద్ద యువగళం నవశకం సభ
- వాడీవేడిగా ప్రసంగించిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలిపల్లిలో ఏర్పాటు చేసిన యువగళం విజయోత్సవ సభలో ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర... కొండంత అండ కోస్తాంధ్ర... రత్నాల సీమ రాయలసీమ... అందాల విశాఖ అందరి విశాఖ అంటూ ప్రసంగం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవనన్నకు... మీ అందరికి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణ గారికి, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారం అంటూ పేర్కొన్నారు.
బొమ్మ బ్లాక్ బస్టర్ గురూ అంటూ యువగళం సక్సెస్ నేపథ్యంలో విజయ నినాదం చేశారు. ఏ బొమ్మ చూస్తే జగన్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కు జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగులుతుందో... ఆ బొమ్మను నేడు మనమందరం చూస్తున్నాం అని లోకేశ్ వివరించారు.
"విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బాబు గారు ఇవాళ ఒకే ఫ్రేములో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు... తాడేపల్లి కొంపలో ఉచ్చ పడాలి! ఇది యువగళం ముగింపు సభ కాదు... ఇది నవశకం. యుద్ధం మొదలైంది... తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు... యువగళం... మన గళం... ప్రజాబలం" అంటూ లోకేశ్ నినదించారు.
"ఈ యువగళం నేను కుప్పం నుంచి మొదలుపెట్టాను. 226 రోజులు... 97 నియోజకవర్గాలు... 2108 గ్రామాలు... 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఈ యువగళం ఆపేందుకు పోలీసులను పంపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూపించి యువగళాన్ని ముందుకు తీసుకెళ్లాను. యువగళాన్ని ఆపేందుకు సైకో జగన్ జీవో నెం.1 తీసుకువచ్చాడు. ఆ రోజే చెప్పాను... జీవో నెం.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో... ఈ లోకేశ్ తగ్గేదే లేదని చెప్పాను. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు... మీ లోకేశ్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం" అంటూ ప్రసంగించారు.