New Criminal Laws: న్యాయ సంహిత బిల్లులకు లోక్‌సభ ఆమోదం
- న్యాయసంహిత, నాగరిక్ సురక్షా సంహిత, సాక్ష్య సంహిత బిల్లులకు లోక్‌సభ ఆమోదం
- మూజువాణి ఓటుతో బుధవారం బిల్లులను ఆమోదించిన దిగువ సభ
- రాజ్యసభలోనూ బిల్లుల ఆమోదానికి కేంద్రం ప్రయత్నం
- డిసెంబర్ 22న ముగియనున్న శీతాకాల సమావేశాలు
బ్రిటీష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానే కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లులను దిగువ సభ ఆమోదించింది. 143 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌లో ఉన్న వేళ ఈ చట్టాలకు ఆమోదం లభించడం గమనార్హం.
ఈ ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య సంహిత (బీఎస్) బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాజా శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఉపసంహరించుకుంది. బిల్లులకు మార్పులు చేర్పుల అనంతరం లోక్‌సభ నేడు బిల్లులను పాస్ చేసింది. త్వరలో ఇవి రాజ్యసభ ముందుకు రానుంది. అయితే, ఈ సమావేశాల్లోనే బిల్లులకు రాజ్యసభ ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. డిసెంబర్ 22న శీతాకాల సమావేశాలు ముగియనున్న విషయం తెలిసిందే.