Air India: ఎయిర్‌ఇండియా విమానం ఇంజన్లో మంటలు రేగినట్టు అలర్ట్‌తో కలకలం!
- డిసెంబర్ 19న ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విమానంలో ఘటన
- ల్యాండింగ్‌కు ముందు విమానం ఇంజన్లో మంటలు చెలరేగినట్టు పైలట్‌కు నోటిఫికేషన్
- ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్, విమానం సురక్షితంగా ల్యాండింగ్
- అనంతరం జరిపిన తనిఖీల్లో మంటలు రేగలేదని వెల్లడి, ఘటనపై డీజీసీఏ దర్యాప్తు
ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో మంటలు రాజుకున్నట్టు అలర్ట్ రావడం కలకలానికి దారి తీసింది. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్లు ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం జరిగిన తనిఖీల్లో ఇంజన్‌లో మంటలు తలెత్తలేదని వెల్లడైంది. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా ఏఐ814 విమానంలో డిసెంబర్ 19న ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం ముంబైలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందు ఇంజన్‌లో మంటలు రేగినట్టు పైలట్‌కు అలర్ట్ అందింది. దీంతో, ముందు జాగ్రత్తగా పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటిస్తూ విషయాన్ని ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో విమానంలో క్రూ సిబ్బంది, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, విమానం ఎయిర్ పోర్టులో సురక్షితంగా దిగింది. అనంతరం, జరిపిన తనిఖీల్లో మంటలు రేగలేదని తేలింది. కనీసం పొగ కూడా లేనట్టు వెల్లడైంది. మరోవైపు, ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది.