Jairam Ramesh: డప్పు కొట్టడం ఆపండి.. ఈ వీడియో చూడండి.. మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీని మోదీ అవమానించిన వీడియోను షేర్ చేసిన జైరాం రమేశ్
- ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అవమానించారంటూ బీజేపీ ఆగ్రహం
- హమీద్ అన్సారీ మతాన్ని ఎత్తిచూపుతూ సాక్షాత్తూ పార్లమెంటులోనే మోదీ అవమానించారన్న జైరాం రమేశ్
- మోదీకి డప్పు కొడుతున్నవారు నీచులు, కపటవాదులు, అవకాశవాదులని ఆగ్రహం
రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పార్లమెంటు వెలుపల అవమానించారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఓ వీడియోతో కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. ప్రధానమంత్రి హోదాలో స్వయంగా అప్పటి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని పార్లమెంటు వేదికగా అవమానించారని, కావాలంటే చూసుకోండంటూ వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. అన్సారీ మతాన్ని ఎత్తి చూపుతూ ఆయన గుర్తింపును తక్కువ చేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లైబ్రరీ ఆడిటోరియంలో సాయంత్రం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలోనూ మోదీ అదే ‘పాట’ చాలా చక్కగా పాడారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అల్ప ప్రధాని, ఆయనకు డప్పు కొట్టేవారు ఇప్పుడు రాజ్యాంగ అధికారులకు అన్యాయం జరిగిపోయినట్టు శోకాలు గుప్పిస్తున్నవారు అత్యంత నీచులు, కపటవాదులు, అవకాశవాదులని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.