America: అమెరికన్ల పొదుపు మంత్రం.. న్యూఇయర్ రిజల్యూషన్లలో ఇదే టాప్
- కొత్త ఏడాదిలో ఖర్చులు తగ్గించుకోవడంపై మెజారిటీ పౌరుల దృష్టి
- ఆరోగ్యంపై దృష్టి సారించాలనే నిర్ణయానికి రెండో స్థానం
- స్టాటిస్టా కన్జూమర్ సర్వేలో వెల్లడించిన అమెరికన్లు
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే వేళ కొత్త ఆలోచనలు, కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం సాధారణమే. వచ్చే ఏడాదిలో చేయదలచుకున్న పనులతో న్యూఇయర్ రిజల్యూషన్స్ ను చాలామంది సిద్ధం చేసుకుంటారు. ఇలా సిద్ధం చేసుకున్న లిస్ట్ లో ఎన్నింటిని అమలు చేస్తామనే విషయం వేరే సంగతి. అయితే, ఈసారి అమెరికన్లు మాత్రం పొదుపు మంత్రం పాటించాలని గట్టిగా నిర్ణయించుకుంటున్నారు. మెజారిటీ అమెరికన్ల న్యూఇయర్ రిజల్యూషన్ ఇదేనని స్టాటిస్టా కన్జూమర్ సర్వే తేల్చింది. ఖర్చులు తగ్గించుకుని డబ్బు పొదుపు చేయాలని చాలామంది భావిస్తున్నారని పేర్కొంది. కొత్త ఏడాదిలో ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని మరికొందరు భావిస్తున్నారట. డబ్బు పొదుపు తర్వాత అమెరికన్ల ఆలోచన దీనిచుట్టే తిరుగుతోందని వివరించింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, అధిక బరువును వదిలించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటున్నారని తెలిపింది.
2024 ఏడాదికి అమెరికన్ల టాప్ రిజల్యూషన్స్ ఇవే..
1. వీలైనంత పొదుపు చేయడం. ఏకంగా 59 శాతం మంది అమెరికన్లు దీనికే ఓటేశారు.
2. వ్యాయామానికి కేటాయిస్తున్న సమయం మరింత పెంచాలని 50 శాతం మంది భావిస్తున్నారు.
3. ఏదిపడితే అది తినడం కాకుండా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని 47 శాతం మంది నిర్ణయించుకున్నారు.
4. కుటుంబంతో, స్నేహితులతో గడిపేందుకు మరింత సమయం కేటాయించాలని 40 శాతం మంది..
5. అధిక బరువును వదిలించుకోవాలని 35 శాతం మంది..
6. దుబారా, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని 26 శాతం మంది..
7. సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకుంటామని 19 శాతం మంది..
8. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఒత్తిడి తగ్గించుకోవాలని 19 శాతం మంది నిర్ణయించుకున్నారని స్టాటిస్టా కన్జూమర్ ఇన్ సైట్స్ వెల్లడించింది.