Sanju Samson: కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసిన సంజూ శాంసన్.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 297 పరుగులు
- శాంసన్ సెంచరీకి తోడు అర్ధ సెంచరీతో రాణించిన తిలక్ వర్మ
- 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసిన భారత్
- దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్‌కి 3 వికెట్లు, నండ్రె బర్గర్‌కు 2 వికెట్లు
కార్ల్ వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సంజూ శాంసన్ మెరిశాడు. శాంసన్‌కి తోడు యువ బ్యాటర్లు తిలక్ వర్మ(52), రింకూ సింగ్ (38) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 297 పరుగుల ఛాలెంజింగ్ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. 103 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ఇన్నింగ్స్‌ను శాంసన్ చక్కదిద్దాడు. తిలక్ వర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో శాంసన్ సెంచరీ, తిలక్ వర్మ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఇక చివరిలో రింకూ సింగ్ విలువైన 38 పరుగులు జోడించడంతో భారత్ 296 పరుగులు చేరుకోగలిగింది.
భారత బ్యాటింగ్:
రజత్ పటీదార్ (22), సాయి సుదర్శన్ (10), సంజూ శాంసన్ (108), కేఎల్ రాహుల్ (21), తిలక్ వర్మ (52), రింకూ సింగ్ (38), అక్షర్ పటేల్ (1), వాషింగ్టన్ సుందర్ (14), అర్షదీప్ సింగ్ (7 నాటౌట్), అవేశ్ ఖాన్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్లను ఆరంభంలో బాగానే కట్టడి చేశారు. వరుసగా విరామాల్లో కీలకమైన వికెట్లు తీశారు. అయితే సంజూ శాంసన్, తిలక్ వర్మ జాగ్రత్తగా ఆడడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు, నండ్రె బర్గర్ 2, విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.
సంజూ శాంసన్ తొలి సెంచరీ..
క్రికెట్ కెరీయర్ ఆరంభమైన చాన్నాళ్ల తర్వాత సంజూ శాంసన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే తొలి శతకం. శాంసన్ 114 బంతులను ఎదుర్కొని 108 పరుగులు సాధించాడు. ఇందులో 3 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.