kL Rahul: అరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్.. 21 ఏళ్ల వ్యవధిలో విరాట్ కోహ్లీ తర్వాత రాహులే!

kL Rahul becomes only 2nd India captain after Virat Kohli to win ODI series in South Africa

  • దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిపించిన రెండవ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
  • కోహ్లీ సారధ్యంలో తొలిసారి వన్డే సిరీస్‌ను దక్కించుకున్న టీమిండియా
  • 21 ఏళ్ల ద్వైపాక్షిక వన్డే సిరీస్ చరిత్రలో రెండు సార్లు మాత్రమే సిరీస్ గెలిచిన భారత్

దక్షిణాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. 2-1 తేడాతో భారత్ సిరీస్‌ను దక్కించుకోవడంతో సౌతాఫ్రికా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలిపించిన రెండవ భారత కెప్టెన్‌గా రాహుల్ నిలిచాడు. తనకన్నా ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 21 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే సఫారీలను వారి సొంత గడ్డపై భారత్ ఓడించి వన్డే సిరీస్ గెలుచుకుంది. ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లు దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే జట్లకు నాయకత్వం వహించగా విరాట్, రాహుల్ మాత్రమే సిరీస్‌లను గెలిపించగలిగారు. 

విరాట్ సారధ్యంలో టీమిండియా 2018లో 6 మ్యాచ్‌ల సిరీస్‌‌ను ఏకంగా 5-1తో దక్కించుకుని చరిత్రను సృష్టించింది. టీమిండియా మొట్టమొదటి దక్షిణాఫ్రికా పర్యటనకు మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 7 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-5 తేడాతో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత పర్యటనలకు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు వన్డే సిరీస్‌ను గెలిపించడంలో విఫలమయ్యారు. కాగా గతేడాది 2022లో దక్షిణాఫ్రికా పర్యటనకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. కానీ 3-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకోలేకపోయింది.

దక్షిణాఫ్రికా పర్యటనల్లో భారత కెప్టెన్‌లు
మహ్మద్ అజారుద్దీన్ - 1992లో ఓటమి (2-5).
రాహుల్ ద్రవిడ్/వీరేంద్ర సెహ్వాగ్ - 2006లో ఓటమి(4-0).
ఎంఎస్ ధోని - 2011లో ఓటమి (2-3).
ఎంఎస్ ధోని - 2013లో ఓటమి (0-2).
విరాట్ కోహ్లీ - 2018లో (5-1) విజయం
కేఎల్ రాహుల్ - 2022లో ఓటమి (0-3).
కేఎల్ రాహుల్ - 2023లో విజయం (2-1).

టెస్టు సిరీస్‌ దృష్ట్యా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, మహ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్లు లేకపోయినప్పటికీ టీమిండియా వన్డే సిరీస్‌‌ను గెలుచుకుంది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టుని కేఎల్ రాహుల్ నడిపించాడు. కాగా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

  • Loading...

More Telugu News