tsrtc: మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన డిమాండ్... బస్సులు అద్దెకు కావాలంటూ ఆర్టీసీ ప్రకటన
- తమకు బస్సులు సరిపోవడం లేదంటూ నగర పరిధిలో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు
- దీంతో అద్దెకు బస్సులు కావాలంటూ ఆర్టీసీ ప్రకటన విడుదల
- ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం... మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళా ప్రయాణికులతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో పలు మార్గాలలో సరిపడా బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తమకు బస్సులు సరిపోవడం లేదని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే ఈ విజ్ఞప్తులు ఎక్కువగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. దీంతో వెంటనే ఆర్టీసీ... అద్దె బస్సులు కావాలని ప్రకటన ఇచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో గుర్తింపు పొందిన మార్గాల్లో టీఎస్ఆర్టీసీ నిర్వహణ కోసం హైర్ స్కీమ్ కింద మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్ బస్సుల సరఫరా కోసం ఎంటర్‌ప్రెన్యూయర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.
రూట్ లిస్ట్, టెండర్ దరఖాస్తు రోజువారీ కిలోమీటర్లు, రెంటల్ రేటు, ఎంటర్ ప్రెన్యూయర్స్ ఎంపిక కోసం ప్రమాణాలు, కాషన్ డిపాజిట్, బస్సు మోడల్, కనీస వీల్ బేస్, సీటింగ్ సామర్థ్యం, సీటు నమూనా, రంగు, బస్సు బాడీ ప్రమాణాలు, అగ్రిమెంట్ వ్యవధి, టెండర్ నోటిఫికేషన్ షరతులు... ఇతర నిబంధనలు, టెండర్ తేదీ, ఇతర వివరాలు టీఎస్ఆర్టీసీ వెబ్ సైట్‌లో చూడవచ్చునని, వీటిని 22 డిసెంబర్ 2023 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ లేదా 9100998230 నెంబర్‌లో సంప్రదించవచ్చునని సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనను సజ్జనార్ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.