Perni Nani: జనసేనకు 25 సీట్లు ఇస్తారట... అందులో సగం స్థానాల్లో టీడీపీ నేతలే పోటీ చేస్తారట!: పేర్ని నాని వ్యంగ్యం
- ఏపీలో సమీపిస్తున్న ఎన్నికలు
- టీడీపీ-జనసేన పొత్తుపై పేర్ని నాని సెటైర్లు
- జనసేనకు తగినంతమంది అభ్యర్థులు కూడా లేరని విమర్శలు!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పొత్తులో భాగంగా జనసేనకు 25 సీట్లు ఇస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని నాని అన్నారు. టీడీపీ 150 సీట్లలో పోటీ చేస్తే, మిగిలిన 25 సీట్లు జనసేనకు ఇస్తున్నారని వివరించారు. జనసేనకు ఇచ్చే ఆ 25 సీట్లలోనూ సగం స్థానాలకు తామే అభ్యర్థులను ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ నేతలు 'ఆఫ్ ద రికార్డ్' చెబుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.
జనసేన తగినంతమంది అభ్యర్థులను కూడా నిలబెట్టలేని స్థితిలో ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారని తెలిపారు. "ఇదీ... జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్న గొప్ప అభిప్రాయం. మేం సరాసరి వైసీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని దమ్ము ధైర్యంతో చెప్పుకోగలుతున్నాం. వాళ్లు... పవన్ కల్యాణ్, మిగతా వాళ్లు అందరూ తెలుగుదేశమే! కాకపోతే వేషాలు వేసుకుంటూ, తలొక పార్టీ అంటూ మెడలో బోర్డు వేసుకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాదొక యువగళం, మాదొక నవశకం, మాదొక ముసలి శకం అని చెప్పుకుంటున్నారు. చెప్పేదేంటంటే... చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కల్యాణ్ 2014 నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నాడు" అని పేర్ని నాని వివరించారు.