Black Woman: సాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే.. వచ్చి కాల్చి చంపారు
- అమెరికాలోని లాన్ కాస్టర్ సిటీలో ఘటన
- 911కు కాల్ చేసి గృహ హింసపై ఫిర్యాదు చేసిన బ్లాక్ ఉమెన్
- కాపాడేందుకు ఆమె అపార్ట్ మెంట్ కు వెళ్లిన పోలీసులు
- చేతిలో కత్తితో గొడవ పడుతున్న మహిళపై కాల్పులు
అమెరికాలోని లాన్ కాస్టర్ సిటీలో దారుణం జరిగింది. సాయం కోసం ఫోన్ చేసిన ఓ మహిళను కాపాడేందుకు వెళ్లిన పోలీసులే కాల్చి చంపారు. అదీ ఆమె పిల్లల ముందే జరగడం మరింత విషాదకరం. ఈ ఘటనలో చనిపోయింది నల్లజాతీయురాలు కావడంతో లాన్ కాస్టర్ లో ఆందోళనకు దారితీసింది. పైగా సదరు పోలీసు అధికారి గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తిని కాల్చిచంపిన రికార్డు ఉండడం గమనార్హం. ఈ నెల 4న జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు.
లాస్ ఏంజిలిస్ కౌంటీలోని లాన్ కాస్టర్ లో నియాని ఫిన్లేసన్ (27) తన ఇద్దరు కూతుళ్లతో నివసిస్తోంది. ఈ నెల 4న నియాని మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమె ఇంటికి వచ్చి గొడవ చేశాడు. దీంతో సాయం కోసం ఆమె పోలీసులకు (ఎమర్జెన్సీ నెంబర్ 911) కాల్ చేసింది. గృహ హింసపై రిపోర్ట్ చేసి సాయంగా పోలీసులను పంపాలని కోరింది. అయితే, తాము అక్కడికి వెళ్లేసరికి నియాని చేతిలో 8 అంగుళాల కత్తి ఉందని, ఎదురుగా ఉన్న వ్యక్తి (నియాని మాజీ బాయ్ ఫ్రెండ్)ని చంపేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు.
ఆ పరిస్థితుల్లో ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు తాము ప్రయత్నించామని చెప్పారు. కత్తి కింద పడేయాలని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నియాని వినిపించుకోలేదన్నారు. అక్కడున్న వ్యక్తిని చంపేందుకు ప్రయత్నిస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని, బుల్లెట్ గాయాలతో పడిపోయిన నియానిని వెంటనే ఆసుపత్రికి తరలించామని వివరించారు. అయితే, అప్పటికే నియాని చనిపోయినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.
ఈ కేసును అటెండ్ అయిన పోలీసులలో టీవై షెల్టన్ అనే అధికారి కూడా ఉన్నారు. ఆయన 2020లో ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో తాజా ఘటనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు చెప్పిన వివరాలు నిజం కాదని నియాని తొమ్మిదేళ్ల కూతురు మీడియాకు వెల్లడించింది. తన ముందే తన తల్లిపై పోలీసులు కాల్పులు జరిపారని, రక్తపు మడుగులో పడిపోయిన తల్లిని చూసి ఏడుస్తుంటే తనను ఓదార్చారని చెప్పింది.
రెండేళ్ల వయసున్న తన చెల్లెలు అమ్మెక్కడా అని అడుగుతుంటే ఏం జవాబివ్వాలో తెలియట్లేదని కన్నీటి పర్యంతమైంది. కాగా, నియాని మరణంపై ఆమె తల్లిదండ్రులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తమ కూతురును చంపిన పోలీసు అధికారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.