Medigadda: మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొదలైన మరమ్మత్తు పనులు
- రూ.55 కోట్లతో మొదటి దశలో కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు షురూ చేసిన కంపెనీ
- నీళ్లు రాకుండా కాఫర్ డ్యామ్‌ను నిర్మిస్తోన్న ఎల్ అండ్ టీ
- రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవడంతో పనులు మొదలుపెట్టిన నిర్మాణ సంస్థ
కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవడంతో బ్యారేజీని నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ ఈ పనులను మొదలుపెట్టింది. మొదటి దశలో రూ.55 కోట్ల విలువైన కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. గత రెండ్రోజులుగా భారీ నిర్మాణ యంత్రాల సహాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి, రాళ్లు అడ్డుగా పొస్తోందని సమాచారం. పనులకు ఆటంకం కలగకుండా నీళ్లు ఆపేందుకు 7, 8వ బ్లాక్‌ల చుట్టూ ఈ కాఫర్ డ్యామ్‌ను నిర్మిస్తోందని సమాచారం.
కాగా మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని పిల్లర్లు ఈ ఏడాది అక్టోబర్‌లో కుంగుబాటుకు గురయ్యాయి. ‘డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్’ 2022 జూన్ 29నే ముగిసిపోవడంతో మరమ్మత్తు పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎల్ అండ్ టీ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. అయితే అంతకుముందు మరమ్మత్తు పనులు తామే చేస్తామని ప్రకటించి మళ్లీ మాట మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ రిపేర్ పనులు మొదలుపెట్టడం గమనార్హం. కాగా పిల్లర్ల దగ్గర ఇసుకను తవ్వి చూస్తే బ్యారేజీ ఎంత మేరకు డ్యామేజీ జరిగిందనేది తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.