Ramcharan: ఐఎస్ పీఎల్ క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేసిన రామ్ చరణ్
- స్ట్రీట్ క్రికెట్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్
- హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినట్లు ట్వీట్
- గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడమే ఉద్దేశమని వ్యాఖ్య
సినిమా రంగంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా క్రీడారంగంలోనూ అడుగుపెట్టారు. గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కొత్త వెంచర్ ను ప్రారంభించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా మారినందుకు సంతోషంగా ఉంది. ప్రతిభ, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ టీమ్ లో భాగం కావాలని భావించే ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోవాలంటూ రామ్ చరణ్ ఓ లింక్ ను కూడా షేర్ చేశారు. కాగా, ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్, బెంగళూరు టీమ్‌కు హృతిక్ రోషన్, జమ్మూకశ్మీర్ టీమ్‌కు అక్షయ్ కుమార్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఐఎస్ పీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. వర్ధమాన క్రికెట్ ఆటగాళ్లకు గుర్తింపు కల్పించేందుకు, కొత్త టాలెంట్ ను వెలికి తీసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని భారత మాజీ సెలెక్టర్, ఐఎస్ పీఎల్ సెలక్షన్ కమిటీ హెడ్ జతిన్ పరాంజపే గతంలో తెలిపారు.