pongu: సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన మంత్రి పొంగులేటి
- కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామన్న పొంగులేటి
- సింగరేణి దినోత్సవం రోజును సెలవుగా ప్రకటిస్తామని హామీ
- ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మంత్రి
సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని తెలిపారు. సింగరేణి దినోత్సవం రోజును సెలవుగా ప్రకటిస్తామని చెప్పారు. కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను చేపడతామని చెప్పారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరపున కొత్తగూడెంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు హామీలు ఇచ్చారు.
పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రచారాన్ని నిర్వహిస్తూ... కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని చెప్పారు. కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఐఎన్టీయూసీని గెలిపించాలని కార్మికులను కోరారు.