Bandi Sanjay: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకే అత్యధిక స్థానాలు... బీఆర్ఎస్ గల్లంతు ఖాయం: బండి సంజయ్
- ఢిల్లీ ఎన్నికల్లో అందరూ మోదీనే మరోసారి ప్రధానిగా కోరుకుంటున్నారన్న బండి సంజయ్
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎలా నెరవేరుస్తుందని ప్రశ్నించిన కరీంనగర్ ఎంపీ
- పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేసిన బండి సంజయ్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఎలా అమలు చేస్తుంది? అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రధాన అర్హత అనే అంశంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు తెల్ల రేషన్ కార్డు అర్హత అనే అంశం విషయంలో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పది లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఇంకా లక్షలాది మంది దరఖాస్తు కోసం వేచి చూస్తున్నారన్నారు.
ఈ లక్షలాదిమందికి ఎలా న్యాయం చేస్తారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోదీకి ఓటు వేస్తామని ప్రజలు చెప్పినట్లు అన్ని సర్వే సంస్థలు చెప్పాయన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని... బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ తనయుడి అహంకారం ఇంకా తగ్గలేదని విమర్శించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అది అర్థమవుతోందన్నారు. ఆయన అహంకారం వల్లే ఓడిపోయినట్లుగా ఇంకా అర్థం చేసుకోవడం లేదన్నారు. మొన్న జరిగినవి అసెంబ్లీ ఎన్నికలను... ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం మోదీనే అందరూ ప్రధానిగా కోరుకుంటున్నారన్నారు.