cold: మరో మూడు నాలుగు రోజులు చలి తీవ్రత ఉండే అవకాశం: వాతావరణ శాఖ
- మూడ్రోజుల పాటు 11 నుంచి 15 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్
- ఈ క్రమంలో మూడ్రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ఆయా జిల్లాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని, 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పదికి దిగువకు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆసిఫాబాద్ 8, గిన్నెదరి 8, బేల 9.1, బజార్హత్నూర్ 9.3, నిర్మల్ 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ జంట నగరాల్లో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.