Corona Virus: తెలంగాణలో కొవిడ్ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదు: వైద్య ఆరోగ్య శాఖ
- ఆందోళన అవసరం లేదు... కానీ అప్రమత్తంగా ఉండాలని సూచన
- గడిచిన 24 గంటల్లో 989 మందికి పరీక్షలు నిర్వహించగా 10 పాజిటివ్ కేసుల నమోదు
- కొత్తగా నమోదైన కేసుల్లో 9 హైదరాబాద్, 1 కరీంనగర్లో ఉన్నట్లు వెల్లడి
తెలంగాణలో కొవిడ్ కేసులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు రవీంద్రనాయక్ సోమవారం కీలక ప్రకటన చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు, గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 989 మందికి పరీక్షలు చేయగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో 9, కరీంనగర్లో 1 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా... మరో 55 మంది ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. మరో పన్నెండు మంది నివేదికలు రావాల్సి ఉందని తెలిపింది.