Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి పయనం.. సీఎం హోదాలో తొలిసారి మోదీని కలవనున్న రేవంత్
- మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి వెళ్తున్న రేవంత్, మల్లు భట్టి
- మోదీతో రేవంత్ అపాయింట్ మెంట్ ఖరారు
- రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు విడుదల చేయాలని కోరనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కలిసి ఢిల్లీకి పయనమవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో వీరు హస్తినకు బయల్దేరుతున్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు వీరికి అపాయింట్ మెంట్ ఖరారయింది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. సీఎం హోదాలో మోదీని రేవంత్ కలవనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలను విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వీరు కోరనున్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని విన్నవించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై మోదీకి వివరించే అవకాశం ఉంది. రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య బద్ధ విరోధం ఉన్న నేపథ్యంలో... రేవంత్ విన్నపాల పట్ల మోదీ ఏ మేరకు స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా వీరు భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలతో పాటు... రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలతో వీరు చర్చించనున్నారు.