Municipal Workers: ఏపీలో పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె
- రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన 50 వేల మంది ఉద్యోగులు
- మంగళవారం నుంచే రాష్ట్రంలో నిలిచిన సేవలు
- ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ డిమాండ్
ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ లోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. దీంతో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, జీతాన్ని రూ.26 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. మంగళగిరి, తాడేపల్లిలోని నగరపాలక సంస్థ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. మంగళగిరిలో చెత్తను తరలించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకున్నారు. ట్రాక్టర్ లో తరలిస్తున్న చెత్తను రోడ్డుపై పడేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తానంటూ ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇవ్వడంతోనే ఆయనకు ఓట్లేసి గెలిపించామని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా సీఎం జగన్ తమకు చేసిందేమీలేదని ఆరోపించారు.
పెరుగుతున్న జనాభా, నగరాల విస్తీర్ణంతో తమపై పని ఒత్తిడి పెరుగుతోందని పారిశుద్ధ్య కార్మికులు మీడియా ముందు వాపోయారు. పెరిగిన పని ఒత్తిడికి తగ్గట్లుగా తమకు చెల్లించే వేతనాన్ని పెంచకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి వేతనంగా రూ.15 వేలు, హెల్త్ అలవెన్స్ కింద రూ.6 వేలు చెల్లిస్తోంది. కరోనా సమయంలో హెల్త్ అలవెన్స్ ను ఆపేయగా.. కార్మికులు పోరాడి సాధించుకున్నారు.