manchireddy kishanr reddy: బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డిపైనా, మాజీ కలెక్టర్‌పైనా కేసు నమోదు
- మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
- నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- మంచిరెడ్డి, తనయుడు ప్రశాంత్ రెడ్డి, మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్‌లపై కేసు
బీఆర్ఎస్ నేత, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఇబ్రహంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి ఫిర్యాదు మేరకు మంచిరెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్‌లపై కేసు నమోదయింది. స్రవంతి ఫిర్యాదుతో పోలీసులు... నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కేసు వివరాలు ఇవీ...
2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ చైర్మన్ పోస్ట్ కోసం తన నుంచి రూ.2.50 కోట్లు తీసుకున్నారని... అంతేకాకుండా తాను చైర్ పర్సన్‌గా ఎన్నికైనప్పటి నుంచి తనను కులం పేరుతో వేధిస్తున్నారని, సమావేశాలు.. సభలలో తనకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా మాట్లాడారని స్రవంతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించడం కోసం తనను సెలవు పెట్టమని బెదిరించేవారని పేర్కొన్నారు. నాటి కలెక్టర్ కూడా మంచిరెడ్డికి మద్దతుగా... ఉన్నత కులం వారితో తక్కువ కులం వారు పెట్టుకోవద్దని తనకు చెప్పారని స్రవంతి తన ఫిర్యాదులో ఆరోపించారు.