Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో పేలుడు.. లేఖను గుర్తించిన పోలీసులు
- రాయబార కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోని ఖాళీ స్థలంలో లేఖ, జెండా గుర్తింపు
- ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించిన ఢిల్లీ పోలీసులు
- తమ సిబ్బంది సురక్షితమని ఇజ్రాయెల్ ఎంబసీ ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు కలకలం రేపింది. పేలుడు శబ్దం వినపడిందంటూ స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ టీమ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో పాటు ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా గాలించగా రాయబార కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో ఒక లేఖను గుర్తించారు. ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాసి ఉండడంతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లెటర్‌తోపాటు చుట్టి ఉన్న ఒక జెండాను కూడా గుర్తించారు. లేఖను సీజ్ చేశారు. ఘటనా స్థలంలో లభించిన వాటిని ఫోరెన్సిక్ పరిశీలన కోసం పంపించారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి ఒహాద్ నకాష్ కయ్నార్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని అన్నారు. తమ సిబ్బంది, కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తులో తమ భద్రతా బృందాలు ఢిల్లీ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. కాగా యూదుల కమ్యూనిటీ కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని చాబాద్ హౌస్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఆ ప్రాంతాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.