Praja palana: జీహెచ్ఎంసీలో వార్డుకు 4 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు
- ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు
- ఒక్కో కౌంటర్ కు టీమ్ లీడర్ సహా 8 మంది సభ్యులు
- కౌంటర్ల ఏర్పాటుపై ముందే సమాచారం అందిస్తామని వెల్లడి
ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించగా.. మిగతా హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 28 నుంచి అధికారులు ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీధర్ బాబు బంజారా భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఒక్కో కౌంటర్ కు ఒక టీమ్ లీడర్, ఏడుగురు సభ్యులు ఉంటారని వివరించారు. వార్డులోని ఏ బస్తీలో ఏ రోజు కౌంటర్ ఏర్పాటు చేస్తారనే విషయాన్ని ముందుగానే సమాచారం ఇస్తామని తెలిపారు.
మహిళలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తులు నింపడం తెలియని వారి కోసం వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అనివార్య కారణాలతో కౌంటర్ ఏర్పాటు చేసిన రోజు దరఖాస్తు చేసుకోకుంటే జనవరి 6 వరకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు. దీంతో పాటు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.