Uttam Kumar Reddy: ప్రజాపాలనలో అధికారులు దరఖాస్తులను తిరస్కరించవద్దు: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
- రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్న ఉత్తమ్
- అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచన
- లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టీకరణ
రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామపంచాయతీల్లో దరఖాస్తులను స్వీకరిస్తామని... అధికారులు ఈ దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలపై వాగ్దానం చేసి ఎన్నికలకు వెళ్లామన్నారు. వాటిని అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.
రేషన్ కార్డులు లేనివారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా విధులను నిర్వర్తించాలన్నారు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందని హామీ ఇచ్చారు.