Jaspreet Bumrah: వెంటవెంటనే వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టిన బుమ్రా
- సెంచురియన్ లో తొలి టెస్టు
- మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 245 ఆలౌట్
- 113 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
సజావుగా సాగిపోతున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బతీశాడు. సెంచురియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఐడెన్ మార్ క్రమ్ (5) వికెట్ కోల్పోయినప్పటికీ, సీనియర్ ఓపెనర్ డీన్ ఎల్గార్, టోనీ డి జోర్జి జోడీ నిలకడగా ఆడడంతో 100 పరుగుల మార్కు దాటింది. ఈ దశలో బుమ్రా విజృంభించి వెంటవెంటనే రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.
తొలుత టోనీ డి జోర్జి (28)ని వెనక్కి పంపిన బుమ్రా... ఆ తర్వాత కాసేపటికే కీగాన్ పీటర్సన్ (2)ను బౌల్డ్ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా 32 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గార్ 76, డేవిడ్ బెడింగ్ హామ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. సఫారీ ఇన్నింగ్స్ లో ఎల్గార్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఎల్గార్ 14 ఫోర్లు కొట్టాడు.