K Kavitha: అలాంటప్పుడు మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారు?: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్ ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్న కవిత
- పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్న
- రేషన్ కార్డులు ఉన్నవారికే పథకాలు ఇస్తామని చెప్పడం సరికాదని వ్యాఖ్య
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలోని గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు కట్టవలసిన అవసరం లేదని... ప్రభుత్వ పెద్దలే ఈ విషయాన్ని చెప్పారని... కాబట్టి నిర్ణీత యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకున్నవారు కరెంట్ బిల్లు కట్టవలసిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆమె బుధవారం నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... అర్హులకు సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని... దీంతో ప్రజలకు రెండు మూడు అంశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని.. అలాంటి వారికి దరఖాస్తు అవసరం లేకుండా పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు పెంచవచ్చునని సూచించారు. అలాంటప్పుడు మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారు? అని ప్రశ్నించారు. మరోసారి దరఖాస్తులు చేసుకోవాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను అమలు చేస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందని సూచించారు. రైతుబంధు నిధులను ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదు? అని ప్రశ్నించారు. రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని...ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్ల తేడా కేవలం 2 శాతమేనని, స్వల్ప ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.