BMW car: రోడ్డుపై వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు నుంచి ఎగసిపడ్డ మంటలు.. కారు దగ్ధం
- కారు బానెట్ నుంచి పొగలు.. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినా దక్కని ఫలితం
- హైదరాబాద్‌లోని నారాయణగూడలో చోటుచేసుకున్న ఘటన
హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక బీఎండబ్ల్యూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీఎస్ 09 ఎఫ్‌ఎం 0094 నంబర్ ఉన్న ఈ కారు బానెట్ నుంచి తొలుత పొగలు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన కారులోని వ్యక్తి రోడ్డు పక్కన చెట్టు కింద ఆపాడు. అయితే మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. ఆ ప్రదేశంలో చెట్లకు నీళ్లు పోస్తున్న జీహెచ్‌ఎంసీ వాటర్ ట్యాంకర్‌తో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
సమాచారం అందుకుని ఫైరింజన్ చేరుకునే సరికి బీఎండబ్ల్యూ కారు పూర్తిగా కాలిపోయింది. కాగా షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని చెబుతున్నారు. సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్‌కు ఎదురుగా ఉన్న కున్ మోటర్స్ పేరిట ఈ కారు ఉంది. తమ సార్ గోవింద్ రెడ్డి కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ షోరూం ప్రతినిధి బాలకృష్ణ చెప్పినట్టుగా ఖైరతాబాద్ పోలీసులు వెల్లడించారు.