Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు హైదరాబాద్ కలెక్టర్​, జీహెచ్​ఎంసీ కమిషనర్ క్షమాపణలు

Hyderabad Collector and GHMC Commissioner apologize to Telangana High Court

  • హైదరాబాద్‌లో చెరువుల రక్షణ కోసం తీసుకున్న చర్యలు చెప్పకపోవడంపై కోర్టు సీరియస్ అవ్వడంతో దిగొచ్చిన అధికారులు
  • తదుపరి విచారణకు హజరు నుంచి మినహాయింపు ఇచ్చిన డివిజన్ బెంచ్
  • హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణల వ్యవహారంపై తదుపరి విచారణ వచ్చే నెల 22కి వాయిదా

హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌ అనుదీప్, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ రొనాల్డ్‌‌ రాస్‌‌ తెలంగాణ హైకోర్టుకు బుధవారం క్షమాపణలు చెప్పారు. చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో వివరాలు సమర్పించకపోవడంతో వీరిద్దరిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. దీంతో బుధవారం వీరిద్దరూ హైకోర్టు విచారణకు హాజరయి క్షమాపణలు చెప్పారు. బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో తదుపరి విచారణకు హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది. 

మరోవైపు రంగారెడ్డి కలెక్టర్‌‌ హైకోర్టు విచారణకు హాజరుకాలేకపోయారు. అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయన అఫిడవిట్‌ దాఖలు చేయగా చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్‌‌ బెంచ్‌‌ అనుమతించింది. తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

కాగా హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల ఆక్రమణల వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇదివరకే కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఈ నివేదికలో చెప్పకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, వీటి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదంటూ గతంలో అందిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. దీనిపైనే విచారణ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News