Natti Kumar: వైసీపీకి 29కి మించి సీట్లు రావు.. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కారణమిదే: సినీ నిర్మాత నట్టి కుమార్
- సినీ ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందన్న నట్టి కుమార్
- త్వరలోనే చంద్రబాబును కలుస్తానని వెల్లడి
- టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ధీమా
రామ్ గోపాల్ వర్మ ఒక సినీ దర్శకుడని... డబ్బులిస్తే సినిమాలు తీస్తాడని టాలీవుడ్ దర్శకనిర్మాత నట్టి కుమార్ అన్నారు. వైసీపీ వాళ్లు డబ్బులు ఇచ్చారు కాబట్టే 'వ్యూహం' సినిమా తీశాడని... డబ్బులు ఇచ్చినందువల్ల వైసీపీపై వర్మకు కచ్చితంగా సానుభూతి ఉంటుందని చెప్పారు. సినిమాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. తాను కూడా 'వ్యూహం' సినిమాను చూస్తానని... ఆ తర్వాత వెంటనే వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తానని చెప్పారు. ప్రస్తుతం సినీ రంగం భయంలో ఉందని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందని.... త్వరలోనే అందరూ టీడీపీ వైపు వస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల మంచి కోసమే తాను టీడీపీకి మద్దతిస్తున్నానని తెలిపారు.
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది? రఘురామకృష్ణరాజును ఎలా చిత్ర హింసలు పెట్టారు? వైసీపీ ఎలాంటి అరాచకాలు చేసింది? ఇలాంటి విషయాలను తన సినిమాలో చూపిస్తానని నట్టి కుమార్ చెప్పారు. వివేకా మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలపై తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని... వైసీపీ 29 సీట్లకు పరిమితమవుతుందని చెప్పారు.