Seethakka: నన్ను మేడమ్ అని పిలువవద్దు: అధికారులకు మంత్రి సీతక్క సూచన
- తనను సీతక్క అనే పిలవాలని సూచించిన మంత్రి
- మేడమ్ అంటే దూరం అవుతుందన్న సీతక్క
- సీతక్క అంటే... మీ చెల్లిగా.. అక్కగా కలిసిపోతామని వ్యాఖ్య
తనను మేడమ్ అని పిలువవద్దని.. సీతక్క అని పిలవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఆమె అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామినిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు మేడమ్ అంటూ పిలవడం ప్రారంభించారు. దీంతో స్పందించిన సీతక్క.. తనను మేడమ్ అని పిలువవద్దని... సీతక్క అని పిలిస్తే చాలని సూచించారు. 'మేడమ్ అంటే దూరం అవుతుంది.. ఇది గుర్తుంచుకోండి.. నన్ను సీతక్క అంటేనే మీ చెల్లిగా.. అక్కగా.. కలిసిపోతాం' అని వ్యాఖ్యానించారు.
పదవులు ఎవరికీ శాశ్వతం కాదని... విలువలు, మంచి పనులే మనకు శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదని.. గల్లీ బిడ్డల పాలన అని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు.. ఏం అవసరమున్నా తమతో చెప్పుకోవచ్చునని ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా... ఆమె జామినిలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.