Amit Shah: సిట్టింగ్ ఎంపీలకు అమిత్ షా పచ్చజెండా... ముఖ్య నేతలకు అగ్రనేత హెచ్చరిక!
- మిగిలిన లోక్ సభ స్థానాలపై ఆరా తీసిన అమిత్ షా
- అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య గ్యాప్ దెబ్బతీసిందన్న కేంద్రమంత్రి
- లోక్ సభ ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కావొద్దని హెచ్చరిక!
తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు... రానున్న లోక్ సభ ఎన్నికల్లో అవే స్థానాల నుంచి చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా పచ్చజెండా ఊపారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలపై చర్చించారు. నలుగురు ఎంపీలకు తిరిగి టిక్కెట్లు ఇస్తామని చెప్పిన అమిత్ షా... మిగతా 13 లోక్ సభ స్థానాల పరిస్థితిపై ఆరా తీశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మధ్య గ్యాప్ దెబ్బతీసిందని, ఇది లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ కావొద్దని నేతలకు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్ళి పార్టీకి నష్టం చేయవద్దని హితవు పలికారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన భాగ్యలక్ష్మి దేవాలయంకు బయలుదేరారు.
కాగా తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, అదిలాబాద్ నుంచి సోయం బాపురావు గత లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ స్థానాల నుంచి తిరిగి వీరే పోటీ చేయనున్నారు.