Team India: మూడ్రోజుల్లోనే ఫినిష్... దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా
- సెంచురియన్ టెస్టులో సఫారీల విజయం
- ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ను ఓడించిన దక్షిణాఫ్రికా
- రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
- దారుణంగా విఫలమైన భారత బ్యాట్స్ మెన్
- కోహ్లీ ఒంటరిపోరాటం
దక్షిణాఫ్రికాలో అత్యంత కఠిన పరిస్థితుల్లో తొలి టెస్టు ఆడిన టీమిండియా ఘోరపరాజయం చవిచూసింది. సొంతగడ్డపై అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన దక్షిణాఫ్రికా జట్టు సెంచురియన్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. కనీస పోరాటం లేకుండానే ప్రత్యర్థికి మ్యాచ్ ను అప్పగించింది. ఈ టెస్టు మూడ్రోజుల్లోనే ముగియడం చూస్తే టీమిండియా ఎంత దారుణంగా ఆడిందో చెప్పొచ్చు.
తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసి ఫర్వాలేదనిపించిన టీమిండియా... రెండో ఇన్నింగ్స్ లో పరమ చెత్తగా ఆడింది. విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్ మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకున్నారు.
కోహ్లీ 76 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. గిల్ 26 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్ లోనూ విఫలం కావడం టీమిండియా అవకాశాలను ప్రభావితం చేసింది. రోహిత్ శర్మ డకౌట్ కాగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 5, శ్రేయాస్ అయ్యర్ 6, కేఎల్ రాహుల్ 4, రవిచంద్రన్ 0, శార్దూల్ ఠాకూర్ 2, బుమ్రా 0, సిరాజ్ 4 పరుగులకు అవుటయ్యారు.
సఫారీ బౌలర్లలో నాండ్రే బర్గర్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో 4 వికెట్లు పడగొట్టాడు. మార్కో యన్సెన్ 3, రబాడా 2 వికెట్లు తీశారు. తొలి టెస్టులో విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్ టౌన్ లో జరగనుంది.