Qatar: ఖతర్‌లో మరణ శిక్ష పడ్డ భారతీయులకు భారీ ఊరట!
- ఖతర్‌లో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు గతంలో మరణ శిక్ష
- మరణ శిక్షను సవాలు చేస్తూ ఇటీవల భారత్ పిటిషన్
- మరణ శిక్షను జైలు శిక్షగా కుదిస్తూ స్థానిక కోర్టు తాజాగా తీర్పు
- ఎన్నేళ్ల జైలు శిక్ష పడిందన్న దానిపై రాని స్పష్టత
ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడ్డ 8 మంది భారత మాజీ నేవి అధికారులకు తాజాగా భారీ ఊరట లభించింది. వారి మరణ శిక్షను జైలు శిక్షగా కుదిస్తూ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అయితే, ఎన్నేళ్ల జైలు శిక్ష విధించారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.
అసలేం జరిగింది..
భారత్‌కు చెందిన 8 మంది గతంలో అల్ దహ్రా సంస్థలో పని చేసేవాళ్లు. ఈ సంస్థ ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందిస్తుంది. అయితే, గతేడాది ఆగస్టులో ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులను గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, స్థానిక న్యాయస్థానం వారికి మరణ శిక్ష విధించడం కలకలానికి దారితీసింది.
మరణ శిక్ష పడ్డవారిలో కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్, అమిత్ నాగ్‌పాల్, కెప్టెన్లు నవ్‌తేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ విశిష్ఠ ఉన్నారు. కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ భారత్ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ వేయగా మరణ శిక్ష రద్దు చేస్తూ తాజాగా తీర్పు వెలువడింది. ఈ విషయమై అక్కడి లీగల్ టీంతో టచ్‌లో ఉన్నామని భారత్ ప్రకటించింది. తదుపరి చర్యలపై చర్చిస్తున్నామని పేర్కొంది.