Virat Kohli: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడూ సాధించని రికార్డును నెలకొల్పిన విరాట్ కోహ్లీ
- ఏడు వేర్వేరు సంవత్సరాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ
- దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన 76 పరుగులతో అరుదైన మైలురాయి
- 1877 నుంచి ఏ ఆటగాడూ సాధించని రికార్డు
దాదాపు 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడూ సాధించని రికార్డును టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. ఏడు వేర్వేరు క్యాలెండర్ సంవత్సరాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 82 బంతుల్లో 76 పరుగులు కొట్టడంతో 2023లో అతడి పరుగులు 2006కి చేరుకున్నాయి. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. గతంలో 2012లో 2,186 పరుగులు, 2014లో 2,286 పరుగులు, 2016లో 2,595 పరుగులు, 2017లో 2,818 పరుగులు, 2018లో 2,735 పరుగులు, 2019లో 2,455 చొప్పున పరుగులు సాధించాడు. 1877లో అంతర్జాతీయ క్రికెట్ మొదలవ్వగా అప్పటి నుంచి అధికారిక రికార్డుల ప్రకారం ఏ ఇతర ఆటగాడూ ఈ ఘనతను సాధించలేదు.
కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులతో చెలరేగిన డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కగిసో రబడా, మార్కో యెన్‌సెన్, బర్గర్‌ల పేస్ త్రయం ముందు భారత బ్యాటర్లు నిలవలేకపోయారు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అయితే విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు రాబట్టాడు. 76 పరుగులు కొట్టగా అందులో ఏకంగా 12 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి.