Abhayahastam: అభయహస్తం దరఖాస్తులపై సందేహాలు.. తెలంగాణ ప్రభుత్వ వర్గాల క్లారిటీ
- రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చన్న ప్రభుత్వం
- క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టీకరణ
- దరఖాస్తులను ఉచితంగానే ఇస్తామని హామీ, కొనుగోలు చేయొద్దని సూచన
రేషన్ కార్డులు లేని వాళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మిగతా వాళ్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ క్రమంలో అనేక మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటూ అభయహస్తం గ్యారెంటీలకూ అప్లై చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, రేషన్ కార్డు లేని కొందరు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ను, మరికొందరు క్యాస్ట్ సర్టిఫికేట్‌ను జత చేస్తుండటం గందరగోళానికి కారణమైంది. ఈ విషయమై అధికారులు క్లారిటీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఏ వర్గమో చెబితే సరిపోతుందని అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్ అవసరం లేదని తెలిపారు.
మరోవైపు, అభయహస్తం అప్లికేషన్లు అందుబాటులో లేవంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ సెంటర్ల వాళ్లు అప్లికేషన్‌ను అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపించారు. అయితే, దరఖాస్తు ఫారాలను ఎవరూ కొనొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉచితంగా దరఖాస్తులను అందజేస్తామని పేర్కొంది.