Chandrababu: ఎగిరెగిరి పడుతున్న వాళ్లను ఎలా అణచివేయాలో నాకు తెలుసు: చంద్రబాబు
- కుప్పంలో రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
- ఈ సాయంత్రం జనసేన శ్రేణులతో భేటీ కానున్న చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వానికి వంద రోజులు మాత్రమే మిగిలుందన్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజుకు చేరుకుంది. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆయన ఈ ఉదయం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సర్కిల్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు కుప్పం బైపాస్ రోడ్డులోని ఎంఎం మహల్ కు ఆయన చేరుకుంటారు. అక్కడ జనసేన శ్రేణులతో ఆయన భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు బీసీఎస్ కల్యాణమంటపంలో నియోజకవర్గ టీడీపీ నేతలతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.
మరోవైపు తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వానికి మిగిలింది వంద రోజులు మాత్రమేనని చెప్పారు. వైసీపీలో ఎగిరెగిరి పడుతున్న వాళ్లను ఎలా అణచివేయాలో తనకు తెలుసని చెప్పారు. యువతలో ప్రతి ఇంటి నుంచి ఒకరు రోడ్డు మీదకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే, ప్రజలు ఓటేస్తే... రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని జగన్ పై మండిపడ్డారు.