Boeing 737 Max: బోయింగ్ సంస్థను వెంటాడుతున్న కష్టాలు.. 737 మ్యాక్స్ విమానాల్లో సరిగా బిగించని నట్లు, బోల్టులు!
- ప్రపంచవ్యాప్తంగా 1,370 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు
- విమాన నియంత్రణకు కీలకమైన రడ్డర్ వ్యవస్థలో లోపం
- యాక్సెస్ ప్యానెల్ విప్పిచూస్తే లోపం ఉన్నదీ, లేనిదీ తెలుస్తుందన్న బోయింగ్
- సమస్యను రెండు గంటల్లోనే పరిష్కరించవచ్చన్న ఎఫ్ఏఏ
- ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు
బోయింగ్ ‘737 మ్యాక్స్’కి కొత్త సమస్య ఎదురైంది. ఇటీవల రెండు 737 మ్యాక్స్ విమానాల్లో కీలకమైన భాగంలో బోల్టులకు నట్లు లేనట్టు గుర్తించారు. అలాగే, మరో విమానంలో ఈ బోల్టులు సరిగా బిగించలేదని ఓ విమానయాన సంస్థ గుర్తించింది. విమానం పనితీరును నియంత్రించే కీలకమైన రడ్డర్ కంట్రోల్ వ్యవస్థలో కనిపించిన ఈ లోపం ఆందోళన కలిగిస్తోంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా 1,370 వరకు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం ఈ విమానాలు వరుస ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో అప్రమత్తమైన బోయింగ్ సంస్థ ప్రస్తుతం ఉన్న విమానాల్లో ఇలాంటి సమస్య ఏమైనా ఉందేమో చూసుకోవాలని కోరింది.
తామైతే ఈ సమస్యను సరిచేశామని, మిగిలిన విమానాల్లో సమస్యలేమైనా ఉన్నాయేమో సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఒక యాక్సెస్ ప్యానెల్ విప్పి చూస్తే సమస్య ఉన్నదీ, లేనిదీ తెలిసిపోతుందని పేర్కొంది. ఒకవేళ సమస్య ఉన్నట్టు గుర్తిస్తే రెండు గంటల్లోనే సరిచేయవచ్చని అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. కాగా, ఐదు సంవత్సరాల క్రితం నెలల వ్యవధిలో ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిన దుర్ఘటనలో 346 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు.