G Jagadish Reddy: మేం ఎలాంటి అప్లికేషన్లు లేకుండా పథకాలను అందించాం: జగదీశ్ రెడ్డి
- ఇష్టారీతిన హామీలు ఇచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నమని ఆరోపణ
- తాము దరఖాస్తు లేకుండా ఆన్ లైన్ ద్వారా అర్హులను ఎంపిక చేశామన్న జగదీశ్ రెడ్డి
- ఈ పత్రాల డ్రామాలు ఎంతో కాలం సాగవన్న మాజీ మంత్రి
గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని... ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ నాయకులు కూడా అయోమయానికి గురవుతున్నారని విమర్శించారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దరఖాస్తులు లేకుండా... దళారి వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేశామన్నారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలు తమకు పథకాలు అడుగుతున్నారు కానీ.. పత్రాలు కాదని చురక అంటించారు. ఈ పత్రాల డ్రామాలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని... హామీలు అమలు చేయకుంటే అదే ప్రజలు మీ వెంటపడి తరుముతారని హెచ్చరించారు. కౌలు రైతులను పాసు పుస్తకాలు అడగడం ఏమిటన్నారు.