Jayaho BC: ​అందుకోసమే 'జయహో బీసీ' కార్యక్రమం: నారా లోకేశ్

Nara Lokesh announces TDP Jayaho BC program

  • జనవరి 4 నుంచి టీడీపీ 'జయహో బీసీ' కార్యక్రమం
  • వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్న లోకేశ్
  • బీసీల్లో చైతన్యం తెచ్చేందుకే 'జయహో బీసీ' కార్యక్రమం అని స్పష్టీకరణ
  • ఈ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని వివరణ
  • 'జయహో బీసీ' సభలో చంద్రబాబు బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తారని వెల్లడి

తెలుగుదేశం పార్టీ జనవరి 4 నుంచి  రాష్ట్రంలో 'జయహో బీసీ' కార్యక్రమం చేపట్టనుంది. వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని బీసీలకు వివరించి, వారిని చైతన్యవంతులను చేయడమే 'జయహో బీసీ' కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. 

వైసీపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో బీసీ సోదరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించిందని, 16 వేల మంది బీసీలకు అవకాశాలను దూరం చేసిందని ఆరోపించారు. 8 వేల ఎకరాల మేర బీసీలకు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి లాగేసుకున్నారని, ఆదరణ పథకాన్ని రద్దు చేసి బీసీల ఉపాధిపై దెబ్బకొట్టారని లోకేశ్ విమర్శించారు. 

అంతేకాదు, బీసీ సోదరుల కోసం పోరాడుతున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. 'బీసీలు బలహీనులు కాదు... బలవంతులు' అన్నదే టీడీపీ నినాదం అని స్పష్టం చేశారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం అంశాన్ని మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. 

కాగా, 'జయహో బీసీ' కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని, మొదటి విడతలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో టీడీపీ నేతలు పర్యటిస్తారని లోకేశ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో బీసీల సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.

అనంతరం, రాష్ట్ర స్థాయిలో 'జయహో బీసీ' సభ ఏర్పాటు చేస్తామని, ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారని వివరించారు. ఈ సభలోనే బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News