passport office: పాస్‌పోర్ట్‌ల కోసం దళారీలను సంప్రదించవద్దు: ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్
- పాస్‌పోర్ట్‌ల జారీలో సికింద్రాబాద్ కార్యాలయం 5వ స్థానంలో ఉందన్న అధికారిణి
- 2023లో ఇప్పటి వరకు 7,85,485 పాస్‌పోర్ట్‌లను జారీ చేసినట్లు వెల్లడి
- గత ఏడాదితో పోలిస్తే లక్షా నలభై వేలకు పైగా పాస్‌పోర్ట్‌లు అధికంగా జారీ చేశామన్న స్నేహజ
పాస్‌పోర్ట్‌ల కోసం ఎవరూ దళారీలను సంప్రదించవద్దని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ విజ్ఞప్తి చేశారు. పాస్‌పోర్ట్‌ల జారీలో మధ్యవర్తులకు ఏమాత్రం అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. తత్కాల్ పద్ధతిలో పాస్‌పోర్ట్‌ల జారీకి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతోందని... సాధారణ దరఖాస్తులు ప్రాసెస్ కావడానికి దాదాపు ఇరవై రెండు రోజుల సమయం తీసుకుంటోందన్నారు.
ఇక పాస్‌పోర్ట్‌ల జారీలో దేశంలోని 37 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో... సికింద్రాబాద్ అయిదో స్థానంలో ఉందని స్నేహజ తెలిపారు. మొదటి నాలుగు స్థానాల్లో ముంబై, బెంగళూరు, లక్నో, చండీగఢ్ ఉన్నట్లు వెల్లడించారు. 2023 సంవత్సరంలో పాస్‌పోర్ట్ కార్యాలయ పనితీరు గురించి ఈ రోజు ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 7,85,485 పాస్‌పోర్ట్‌లను జారీ చేసినట్లు వెల్లడించారు. 2022తో పోలిస్తే ఈసారి లక్షా నలభై వేలకు పైగా పాస్‌పోర్ట్‌లు అధికంగా జారీ చేశామన్నారు.