TSRTC: టీఎస్ ఆర్టీసీకి 80 కొత్త బస్సులు.. ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించిన మంత్రి
- కొత్త బస్సుల్లో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులు
- త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్న సజ్జనార్
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత సరిపడా బస్సులు లేక ఉన్న బస్సులు ఓవర్ లోడ్ అవుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అద్దె బస్సులను పెంచుకోవడంతోపాటు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. అద్దె బస్సులకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా 80 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ 80 కొత్త బస్సులు ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్‌ప్రెస్ బస్సులు కాగా, 30 రాజధాని, 20 లహరి స్లీపర్, సీటర్ బస్సులు ఉన్నాయి. త్వరలోనే మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్టు సజ్జనార్ తెలిపారు. వీటిలో హైదరాబాద్‌కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయిస్తామని తెలిపారు.