CM Revanth: రైతు భరోసా, పింఛన్లపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
- పాత లబ్దిదారులకు యథాతథంగా వస్తాయని వెల్లడి
- కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలని సూచన
- అభయ హస్తం దరఖాస్తుల అమ్మకంపై సీరియస్
- సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం క్లారిటీ ఇచ్చారు. ఈ పథకంతో పాటు అభయహస్తం దరఖాస్తులకు సంబంధించి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈమేరకు శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి, పింఛన్లకు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే ఈ ప్రయోజనం (రైతు బంధు, పింఛన్) పొందుతున్న వారి ఖాతాల్లో యథావిధిగా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజాపాలన కేంద్రాలలో సరిపడా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.