Thummala: సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు
- సంక్షేమ పథకాలు ఆలస్యం కావొచ్చు కానీ తప్పకుండా అమలు చేస్తామన్న మంత్రి
- తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన
- తెలంగాణలో వనరులు ఉన్నా... గత ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ... పథకాలు అర్హులకు అందిస్తామని... వీటి అమలు కాస్త ఆలస్యం కావొచ్చు కానీ... తప్పకుండా చేసి తీరుతామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాపోయారు. అందుకే సంక్షేమ పథకాల అమలు కొంత ఆలస్యం కావొచ్చు.. కానీ వాటిని అమలు చేయడం మాత్రం పక్కా అన్నారు. దుబారా ఖర్చులు మానివేసి... ప్రజల అవసరాలు తీరేలా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయని... కానీ పాలనాపరమైన ఇబ్బందుల వల్ల గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిందన్నారు.
మంత్రులం అందరం సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నామని.. కొన్ని రోజుల్లో ప్రజలతో శభాష్ అనిపించుకునేలా పాలన సాగిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో మంచి మార్పు వచ్చిందని... ఇక్కడి ప్రజల కోరికలు తీరుస్తామని మాట ఇచ్చారు. నిర్బంధ... అవినీతి... అశాంతి... నియంత పాలనను అసెంబ్లీ ఎన్నికల్లో తరిమి కొట్టారన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించినందుకు ప్రజలందరికీ మరోసారి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.