Tirumala: తిరుమల నడకదారిలో మరోసారి క్రూరమృగాల కలకలం
- గతంలో నడకదారిలో లక్షిత అనే బాలికను చంపేసిన చిరుత
- ఇప్పుడదే ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారం
- ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించిన అధికారులు
- భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ
- నడకదారిలో భక్తులు గుంపులుగా రావాలని సూచన
తిరుమల నడకదారిలో ఆగస్టులో లక్షిత అనే చిన్నారిని చిరుతపులి అడవిలోకి లాక్కెళ్లి చంపేయడం తెలిసిందే. అంతకుముందు కౌశిక్ అనే బాలుడిని కూడా అడవిలోకి లాక్కెళ్లినా సిబ్బంది వెంటనే స్పందించడంతో ఈ చిన్నారి సజీవుడిగా తిరిగి వచ్చాడు.
ఈ రెండు ఘటనల నేపథ్యంలో, తిరుమల నడకదారులు అంటేనే భక్తులు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. భక్తుల భయాందోళనల కారణంగా, టీటీడీ అధికారులు అటవీసిబ్బంది సాయంతో నడకదారి వెంబడి సంచరించే కొన్ని చిరుతలను బంధించి వాటిని అక్కడ్నించి తరలించారు. అప్పటికీ నడకదారుల వెంబడి ట్రాప్ కెమెరాలతో వన్యమృగాల సంచారంపై నిఘా కొనసాగిస్తున్నారు.
తాజాగా, తిరుమల నడకదారిలో మరోసారి క్రూరమృగాల సంచారం కలకలం రేపుతోంది. లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే ఓ చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు గుర్తించారు.
డిసెంబరు 13, 26 తేదీల్లో ఇక్కడి ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి ఛాయాచిత్రాలు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో, టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నడకదారిలో వచ్చే భక్తులు గుంపులుగా రావాలని సూచించింది. కాగా, మరోసారి చిరుత సంచారంపై వార్తలు వస్తుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.