Vinesh Phogat: భజరంగ్ పునియా బాటలో వినేశ్ ఫోగాట్... ప్రధాని నివాసం వద్ద అర్జున, ఖేల్ రత్న అవార్డులు వదిలేసిన రెజ్లర్
- డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రెజ్లర్లు
- సంజయ్ సింగ్... గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు సన్నిహితుడు
- బ్రిజ్ భూషణ్ పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాక స్టార్ రెజ్లర్లు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సన్నిహితుడు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ మహిళా రెజ్లర్లు వారాల తరబడి ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ పగ్గాలు చేపట్టడాన్ని రెజ్లర్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
సాక్షి మాలిక్ తాను రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించగా, భజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద వదిలేశాడు. ఇప్పుడు భజరంగ్ బాటలోనే మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కూడా నడిచింది. ఆమె తన అర్జున అవార్డు, ఖేల్ రత్న పురస్కారాలను ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద వదిలేసింది.