ration cards: రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ
- జనవరి 31తో గడువు ముగుస్తుందని అప్రమత్తం చేసిన పౌరసరఫరాల శాఖ
- శనివారం ఉత్తర్వులు జారీ చేసిన ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్
- రాష్ట్రంలో రెండు నెలలుగా కొనసాగుతున్న ప్రక్రియ
తెలంగాణలో రెండు నెలలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31 తుది గడువని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అప్రమత్తం చేశారు. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ 70.80 శాతం పూర్తయ్యిందని వెల్లడించారు. 87.81 శాతం నమోదుతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రథమ స్థానంలో, అతి తక్కువగా 54.17 శాతంతో వనపర్తి జిల్లా చివరి స్థానాల్లో నిలిచాయని ఉత్తర్వుల్లో తెలిపారు. రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును చౌకధరల దుకాణాల్లో డీలర్లు సేకరిస్తున్నారు.