Jogi Ramesh: చంద్రబాబుకు పవన్ కల్యాణ్ తాబేదారు: మంత్రి జోగి రమేశ్
- పవన్ కల్యాణ్ కు ఏపీలో ఓటు హక్కే లేదన్న మంత్రి
- ఆయనకు కనీస జ్ఞానం లేదంటూ మండిపాటు
- 30 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలు కనిపించట్లేదని విమర్శ
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కే లేదని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. ఆయనకు రాష్ట్రంలో ఆధార్ కూడా లేదన్నారు. చంద్రబాబుకు ఆయన తాబేదారుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కు కనీస జ్ఞానం కూడా లేదని, అందుకే ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. ఈమేరకు మంత్రి జోగి రమేశ్ ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగలేదని మంత్రి జోగి రమేశ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ‘ఏ గ్రామానికైనా వెళదాం.. ఇల్లు ఎవరు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారని ప్రజలనే అడుగుదాం’ అంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేశ్ సవాల్ చేశారు.
చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఏ గడ్డయినా తింటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కాచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం తమదని, 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలాచోట్ల గృహప్రవేశాలు కూడా చేసిన ఈ పథకంలో ఏం స్కాం జరుగుతుందో చెప్పాలంటూ పవన్ కల్యాణ్ ను నిలదీశారు. పవన్ కు బుర్ర లేదని, కనీస జ్ఞానం లేదని మండిపడ్డారు. అదే ఉండుంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ప్రధానికి లేఖ రాసేవాడని మంత్రి జోగి రమేశ్ చెప్పారు. పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో ప్రశ్నించావా అంటూ నిలదీశారు. పవన్‌కు బుద్ది ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలని మంత్రి జోగి రమేశ్ హితవు పలికారు.