Vishnu Kumar Raju: కేంద్ర సంస్థలు ఏపీ వైపు ఒక చూపు చూసుంటే అసలు తమాషా బయటపడేది: విష్ణుకుమార్ రాజు
- విశాఖ బీజేపీ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు ప్రెస్ మీట్
- సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
- ఇలాంటి వ్యక్తి సీఎం కావడం ప్రజలు చేసుకున్న పాపం అని వెల్లడి
- ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఓటేయవద్దని పిలుపు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. విష్ణుకుమార్ రాజు ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నా తమకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగా చెబుతున్నారని వెల్లడించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజలు పూర్వజన్మలో చేసుకున్న పాపం అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.
ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఓటేయకుండా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళుతుందని అన్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయమే ఉందని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
"మన వద్ద డబ్బులు దొబ్బి, ఆ డబ్బునే మనకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది. కాంట్రాక్టర్ల చెల్లింపుల్లో పర్సంటేజీలు!... పేమెంట్ వచ్చిందని సంతోషపడాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి! కేంద్ర సంస్థలు గనుక ఒక చూపు చూసి ఉండుంటే అసలు తమాషా బయటపడేది. కేంద్ర సంస్థలు ఇటువైపు చూస్తాయన్న నమ్మకం ఉంది.
రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చారు. దీనికోసం జీవో 512 తీసుకువచ్చారు. ఇదొక దిక్కుమాలిన జీవో. మూడు నెలల తర్వాత మేం అధికారంలోకి వస్తాం. వచ్చిన వెంటనే ఈ జీవోను రద్దు చేస్తాం" అని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.