Tsunami: జపాన్ ను తాకిన సునామీ అలలు... పశ్చిమ తీరంలో హై అలర్ట్
- నూతన సంవత్సరాది వేళ జపాన్ లో భూకంపం
- పశ్చిమ తీరంలో ప్రకంపనలు... సునామీ అలర్ట్ జారీ
- వజిమా నగరాన్ని తాకిన సునామీ
- నోటో ప్రాంతానికి కూడా సునామీ
ప్రపంచ దేశాలన్నీ నూతన సంవత్సరాది సంబరాల్లో మునిగితేలుతుండగా, జపాన్ మాత్రం సునామీ భయంతో బిక్కుబిక్కుమంటోంది. జపాన్ లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు భారీ భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా జపాన్ పశ్చిమ తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి.
ఈ క్రమంలో ఇషికావా రాష్ట్రంలోని వజిమా నగరాన్ని 1.2 మీటర్ల ఎత్తున సునామీ అలలు తాకాయి. కాగా, ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థను ఉటంకిస్తూ ఏఎఫ్ పీ మీడియా సంస్థ వెల్లడించింది. 2011 తర్వాత జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ కావడం ఇదే ప్రథమం.
కాగా, భూకంపం ప్రభావంతో జపాన్ పశ్చిమ తీరప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నిగాటా, తొయామాలో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పక్కకి ఒరిగిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7కి పైగా తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి ఇషికావా తీర ప్రాంతంలోని ఇళ్లు ఊగిపోయాయి. దాంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరికొన్ని సార్లు ప్రకంపనలు రావడంతో అధికారుల హెచ్చరిక మేరకు ప్రజలు మళ్లీ తమ నివాసాల్లోకి వెళ్లకుండా వీధుల్లోనే ఉన్నారు.
సునామీ నేపథ్యంలో, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. జపాన్ ప్రధాని కిషిదా నేరుగా ప్రజలకు సందేశం అందించారు. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.