Revanth Reddy: రేవంత్ రెడ్డి తెలంగాణను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
- పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపాడని కితాబు
- నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపేసిన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందన్న వినోద్
- బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో నిలిచిందని వ్యాఖ్య
కొత్త ఏడాదిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపాడని కితాబునిచ్చారు. కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్వీ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపేసిన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసిందన్నారు. ప్రతి ఎకరాకు గోదావరి జలాలను ఇచ్చినట్లు చెప్పారు. 2014 కంటే ముందు తెలంగాణలో ఏడువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 25 వేల మెగావాట్లకు పెంచామన్నారు. ఐటీ పరిశ్రమతో పాటు, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేశామని వినోద్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో నిలిచిందన్నారు.