Glucose Test: షుగర్ టెస్టుకు కొత్త పరికరం .. తెలుగు శాస్త్రవేత్తకు పేటెంట్ హక్కులు

Telugu Scientist Chiranjeevi Srinivasa Rao from IIT kanpur awarded patent glucose measuring device

  • ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు ఘనత
  • సూది అవసరం లేకుండానే చెమటతో షుగర్ లెవెల్స్ కొలిచే పరికరం తయారీ 
  • నాలుగేళ్ల పాటు శ్రమించి పరికరం రూపకల్పన
  • తన పరికరం..పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయుక్తమని వెల్లడి

చెమటను పరీక్షించి రక్తంలో షుగర్ స్థాయులను చెప్పే ఓ కొత్త పరికరాన్ని ఏపీకి చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు కనుగొన్నారు. ఆయనకు ఇటీవల కేంద్రం ఈ పరికరంపై పేటెంట్ హక్కులు జారీ చేసింది. సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు. ఫలితంగా ఈ పరికరం చిన్నారులకు, పలుమార్లు షుగర్ టెస్ట్ అవసరమైన వారికి ఉపయుక్తంగా ఉంటుందని డా.శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 29న ప్రభుత్వం పేటెంట్ హక్కులు ఇస్తూ ధ్రువపత్రం జారీ చేసింది. 

తాను రూపొందించిన పరికరాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పలు విధాలుగా పరీక్షించి తాజాగా పేటెంట్ హక్కులు జారీ చేసిందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరికరాన్ని రూపొందించేందుకు తాను నాలుగేళ్ల పాటు కష్టపడ్డట్టు ఆయన చెప్పారు. ఇది మార్కెట్‌లోకి వస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. టైప్ 1 మధుమేహం బారిన పడుతున్న వారు రోజుకు నాలుగు సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్ వేసుకోవాలి. క్రమం తప్పితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. టైప్-2 మధుమేహ బాధితులూ తరచూ షుగర్ టెస్టు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాసరావు ఈ ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని కనుగొన్నారు.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన డా.శ్రీనివాస రావు నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విద్యాభ్యాసం పూర్తి చేశారు. జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్నారు.

  • Loading...

More Telugu News